Canada Prime Minister: కెనడా ప్రధాని పోటీలో అనిత ఆనంద్, జార్జ్ చాహల్..! 21 h ago
కెనడా ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడంతో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్కోతో పాటు భారత సంతతికి చెందిన ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి.
అనితా ఆనంద్...: భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ 2019లో ఓక్ విల్లే నుంచి ఎంపీగా ఎన్నికై ట్రూడో క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణమంత్రిగానూ వ్యవహరించారు.
ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్, తల్లి పంజాబ్ కి చెందినవారు.
జార్జ్ చాహల్...: భారత సంతతికి చెందిన జార్జ్ చాహల్ ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సహజ వనరులపై ఏర్పాటుచేసిన స్టాండింగ్ కమిటీకి ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. సిక్కుల కాకస్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, చాహల్ను లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ తాత్కాలిక నేతగా నియమించింది. అందువల్ల ఆయన పార్టీ నాయకుడిగా గెలిచిన ప్రధాని పదవి చేపట్టేందుకు అర్హత కలిగివుండరు. కెనడా చట్టాల ప్రకారం.. తాత్కాలిక నేతలు ప్రధాని పదవి చేపట్టేందుకు వీల్లేదు.